ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన వరంగల్ పశ్చిమ, పరకాలలో నిర్వహించిన హోం ఓటింగ్ మూడో రోజు గురువారం ప్రశాంతంగా ముగిసింది. పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇళ్ల వద్దకు ఎన్నికల అధికారులు, సిబ్బంది వెళ్లి ఓటును స్వీకరించారు. ఫారం 12 డి ద్వారా దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకోగా వారి ఇళ్ల వద్దకు ఎన్నికల అధికారులు, సిబ్బంది వెళ్లి ఓటర్ల నుండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు గురువారం పరకాల,వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్నవారిలో 353 మంది ఓటర్లుఉన్నారు. పరకాల నియోజకవర్గంలో 302 మంది ఓటర్లు ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. హోం ఓటింగులో పరకాల నియోజకవర్గం నుండి 302మంది ఓటర్లకు గాను 297(మొత్తం 98.34శాతం )మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారని, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 353మంది ఓటర్లు ఉండగా 336మంది ఓటర్లు (మొత్తం 95.18 శాతం )తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 655మంది ఓటర్లకు గాను 633మంది (మొత్తం 96.64 శాతం )హోం ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. కాగా హోం ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసినట్లు అధికారులు తెలిపారు.
Post A Comment: