ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమష్టి కృషి చేయాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.
సోమవారం నాడు కలెక్టర్ పరకాల ఆర్డీఓ కార్యాలయం లో నోడల్ అధికారుల, ఎన్నికల టీమ్ ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నియోజకవర్గం లో ఎక్కడైనా అక్రమ మద్యం, డబ్బు, సరుకుల పంపిణీ, రవాణా జరిగినప్పుడు ప్రజలు సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారు వివరాలు గోప్యం గా ఉంచుతామన్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా రూ. 50 వేలకు మించి డబ్బును తరలిస్తే స్వాధీనపరుచుకుంటామన్నారు. . నియోజకవర్గానికి మూడు చొప్పున ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, వారు ఎక్కడ ఫిర్యాదు అందినా తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారని అన్నారు. పోలీసు,అబ్కారీ శాఖలు చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు.
చెక్ పోస్ట్ లలో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని నగదు దొరికితే ఏర్పాటు చేసిన గ్రీన్ కమిటీ కి అన్ని ఆధారాలతో సమర్పించాలని సూచించారు. అక్రమ మద్యం , నల్ల బెల్లం, నాటు సారా పై గట్టి నిఘా ఉంచి నిరంతర తనిఖీలు చేపట్టాలని పట్టుబడిన వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. అక్కౌంట్ బదిలీలను అలాగే లావాదేవీలు నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు వాణిజ్య పరమైన లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని , తనిఖీలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఆర్డీఓ శ్రీనివాస్ జడ్పీ సీఈఓ శ్రీనివాస్, డిసిఓ నాగేశ్వరావు,ఈఆర్వో లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


Post A Comment: