ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మంథని నియోజకవర్గంలో భారాస నుండి టికెట్ ఆశించి భంగపడ్డ చల్లా నారాయణ రెడ్డి పయనమెటు అన్నది నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది. భారాస మంథని నియోజకవర్గంలో అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానని కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారాయణ రెడ్డి ఉవ్విళ్ళూరారు. నియోజక వర్గంలోని ప్రతి మండలాన్ని, గ్రామాలను విస్తృతంగా పర్యటించి మంచి చెడు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మంథని నియోజకవర్గం భారాస ఇంఛార్జీ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును పక్కనబెట్టి తనకే టికెట్ కేటాయింపు జరుగుతుందని అధిష్ఠానం ఆశీస్సులు తనకే ఉంటాయని భావించారు. కానీ అధిష్ఠానం పుట్ట మధు పేరు ప్రకటించడంతో డోలాయమాన పరిస్థితి ఏర్పడింది. మంథని ఇవతల కాటారం, మహదేవపూర్, మల్హర్రావు,మహాముత్తారం, పల్మెల మండలాల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా మంథని, కమాన్ పూర్, రామగిరి, మంథని ముత్తారం మండలాల్లో విస్తృతంగా పర్యటించి సంబంధాలు మెరుగు పరుచుకున్నారు. ఈసారి మంథని ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం తో ఉండగా అధిష్ఠానం పుట్ట మధును అభ్యర్థి గా ప్రకటించడంతో ప్రత్యామ్నాయం ఏంటనే ఆలోచన లో పడ్డారు చల్ల నారాయణ రెడ్డి. అధిష్ఠానం నిర్ణయంపై పునరాలోచన చేస్తూ కార్యకర్తల మనోభాలకనుగుణంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని నారాయణ రెడ్డి ప్రకటించారు. ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్ నుండి ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు,భారాస నుండి పుట్ట మధు,భాజపా నుండి సునీల్ రెడ్డి లు మంథని నియోజకవర్గంలో త్రిముఖ పోరుకు సిద్ధం అయ్యారు. ఈ తరుణంలో మంథని భారాస టికెట్ ఆశించి భంగపడ్డ చల్లా నారాయణ రెడ్డి ఎటు వైపు వెళ్తారు. మంథని లోని భారాస అసమ్మతి గళం విప్పిన నేతలను అక్కున చేర్చుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా... లేక ఇతర పార్టీల లో చేరి తన బలాన్ని పలుకుబడిని ఉపయోగించి తన సామాజిక వర్గం మద్దతు సమీకరించి మంథని నియోజకవర్గంలో పోటీ లో ఉంటారా...అన్నది చర్చనీయాంశం అయింది. తెలుగు దేశం,బీఎస్పీ,అమ్ ఆద్మీ పార్టీ లాంటి వారితో సంప్రదించి మంథని అభ్యర్థి గా రంగంలోకి దిగుతారా..అనేది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మరో రెండు నెలల సమయం ఉండడంతో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికి అంతుపట్టని పరిస్థితి నెలకొంది.
Post A Comment: