ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సత్వరమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. 

శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి  ఆసరా ఫించన్, తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ,  వృద్దాప్య ఆసరా ఫించన్ దారులు మరణించిన పక్షంలో వారి భాగస్వామికి పెన్షన్ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న ఆసరా ఫించన్ దరఖాస్తులు వారం లో మంజూరు చేయాలని సీఎస్ తెలిపారు. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ సంబంధించి జిల్లా కమిటి స్క్రూటినీ పూర్తి చేసి  జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ పత్రాలు సెప్టెంబర్ 15 నాటికి పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. 

స్వాతంత్ర్య  వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకల సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 26న కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని, ఆగస్టు 26న జరిగే ప్లాంటేషన్ లో ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని సీఎస్ అన్నారు.  

నీటి పారుదల శాఖ పరిధిలోని భూములలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాలలో లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ 2 వారాల్లో పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని సీఎస్ తెలిపారు.

గొర్రెల పంపిణీ పథకం క్రింద జిల్లాలకు  నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవాలని , గొర్రెల యూనిట్ల కొనుగోలు వేగవంతం చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీఎస్ పేర్కొన్నారు. గొర్రెల యూనిట్లతో పాటు వాటికి దాణా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీ లక్ష్యాలను త్వరగా చేరుకునేందుకు అదనపు బృందాలను పంపాలని అన్నారు.  

బీసి కులవృత్తుల లక్ష రూపాయల ఆర్థిక సహాయం క్రింద మొదటి దశలో మంజూరైన  నిధులు త్వరితగతిన   లబ్దిదారులకు అందించాలని  సీఎస్ సూచించారు.  మైనారిటీల సంక్షేమం క్రింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకంలో జనాభా ప్రాతిపదికన జిల్లాలకు నిధులు విడుదల చేశామని, జిల్లాలకు కేటాయించిన లక్ష్యాల మేరకు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఆర్థిక సహాయం పంపిణీ చేయాలని అన్నారు. పెండింగ్ ప్రభుత్వ కారుణ్య నియామకాల  భర్తీ వారం రోజులలో పూర్తి చేయాలని సీఎస్ అన్నారు.

గృహలక్ష్మి పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల 40 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు 5 లక్షల 44 వేల దరఖాస్తుల క్షేత్రస్థాయి ధృవీకరణ పూర్తయిందని, నిర్దేశిత సమయంలో క్షేత్రస్థాయి స్క్రూటిని పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని,  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హూలను ఎంపిక చేసి లబ్దిదారుల జాబితా జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తీసుకొని మంజూరు చేయాలని సీఎస్ తెలిపారు. 

సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని,  స్థానిక ఎమ్మెల్యే సమయం తీసుకుని త్వరితగతిన పంపిణీ పూర్తి కావాలని అన్నారు.   ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద పెండింగ్ రుసుము  వసూలు ప్రణాళికాబద్ధంగా చేయాలని, 10 లక్షల కంటే ఎక్కువ రుసుము ఉన్న లబ్ధిదారుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ పేర్కొన్నారు.  రెండవ దశ జీఓ 59 కింద దరఖాస్తుల ధృవీకరణ పై శ్రద్ద వహించి వారం రోజులలో ధృవీకరణ పూర్తి చేయాలని అన్నారు. 

ప్రభుత్వ ఉత్తర్వు 58 కింద వచ్చిన దరఖాస్తుల ధృవీకరణ పూర్తి చేసి అర్హులకు పట్టాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. నోటరి భూముల క్రమబద్ధీకరణ దిశగా వచ్చిన దరఖాస్తుల ధృవీకరణ ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని అన్నారు.  61 సంవత్సరాల నిండిన విఆర్ఎ వారసులకు ఉద్యొగ కల్పనకు సంబంధించి ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. 

జిల్లా వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ సీక్త పట్నాయక్, కమిషనర్ రిజవాన్ బాషా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి  జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: