మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
: ఎన్నికల నిర్వహణలో ప్రతిసారీ కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, అందుకే ఈ ప్రక్రియలో పాల్గొనడం ప్రతి అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. మరో అయిదారు నెలల్లో రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఎస్పీలు, కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి, పాత కేసులు... తదితర అంశాలను డీజీపీ వివరించారు. జూన్, జులైల్లో చేయాల్సిన పనులు, కేంద్ర బలగాలతో సమన్వయం, సిబ్బంది మోహరింపు వంటి అంశాలపై అంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లలో చాలామందికి గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం లేదని, వారంతా సీనియర్ అధికారుల సహకారం తీసుకోవాలని అంజనీకుమార్ సూచించారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల నిర్వహణలో పాల్గొని వచ్చిన అదనపు డీజీ సౌమ్యా మిశ్ర, డీసీపీ అభిషేక్ మొహంతి తమ అనుభవాలను పంచుకున్నారు. నిఘా విభాగాధిపతి అనిల్‌కుమార్ మాట్లాడుతూ... ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న పోలీసు అధికారులను ఎన్నికల సమయంలో తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ... సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల ఏర్పాటుపై శ్రద్ధ చూపించాలన్నారు. సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ... ఎన్నికల విధులకోసం వచ్చే బలగాలకు మార్గదర్శకత్వం చేసేలా ఠాణాల్లో గైడ్‌ను సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ పోలీసు బెటాలియన్ల అదనపు డీజీ స్వాతిలక్రా, ఐజీ షానవాజ్ ఖాసిం, డీఐజీ కార్తికేయ పాల్గొన్నారు
Post A Comment: