మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
కొమురం భీం జిల్లా: మే 04
గత ఏడాది కాలంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో స్తంబ్ధుగా ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ కార్యకలపాలు చాపకింద నీరులా జిల్లా అంతటికీ విస్తరించాయన్న సమాచారం పోలీసు యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నాలుగు రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం జిల్లెడ గ్రామంలో ఇద్దరు మావోయిస్టు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో జిల్లాలో ఆ పార్టీ విస్తరణ, క్యాడర్ నియామకాల అంశం వెలుగులోకి వచ్చినట్లయింది. సరిగ్గా ఏడాది క్రితం మైలారపు ఆడెళ్లు ఆలియాస్ భాస్కర్ నేతృత్వంలో 8 మంది సభ్యుల మావోయిస్టు బృందం ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని మూడు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కొత్త నియామాకాలు చేపట్టినట్టు అప్పట్లోనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే తిర్యాణి మండలం మంగీ అటవీ ప్రాంతంలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఈ పరిణామాల క్రమంలోనే కాగజ్‌నగర్ -కడంబా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కొత్తగా రిక్రూట్ అయిన ఓదళ సభ్యుడు కూడా మృత్యువాత పడిన విషయం జిల్లా పాఠకులకు విధితమే. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు పెద్దగా కన్పించలేదు. అయితే అడపా, దడపా మహారాష్ట్ర గడ్చిలిరోలి జిల్లా నుంచి కాగజ్‌నగర్ అటవీప్రాంతానికి మావోయిస్టులు రాకపోకలు సాగించి వెల్లినట్టు పోలీసులు గుర్తించి ప్రాణహితనది పరివాహాకప్రాంతంలో నిఘా పెంచారు. మరోవైపు మంచిర్యాల కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ఇంటలిజెన్స్ బృందాలు కూడా మావోల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ జిల్లా పోలీసులతో సమాచారాన్ని పంచుకుంటూ రావటంతో ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన యువకుడితో పాటు, పెంచికల్‌పేటకు చెందిన ఆనంద్‌రావు అనే యువకుడు పార్టీలో చురుగ్గా పని చేస్తున్నారనే విషయం వెల్లడైనట్టు పోలీసుశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే పోలీసులు అనుమానిస్తున్నట్టుగా జిల్లాలో వీరిద్దరే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారనేదిపై ఇంటలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. అరెస్టు అయిన ఈ ఇద్దరు విచారణలో పోలీసులు కీలకమైన సమాచారాన్ని రాబాట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో పోలీసులు మరింత ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టుల వద్ద పేలుడు పదార్థాలు లభ్యమైన దరిమిలా తెలంగాణలో తిరిగి ఏమైనా ఘటనలకు పాల్పడేందుకు ఆ పార్టీ వ్యూహరచనచేస్తోందన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
సరిహద్దు గ్రామాలపైనే నజర్..
గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన సరిహద్దు గ్రామాలపైన్నే పోలీసులు ప్రస్తుతం దృష్టిసారించి ప్రతి ఒక్కరి కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా ముద్ర ఉన్న వ్యక్తులతోపాటు కొత్తగా పార్టీకి ఆకర్షితులైన వారి కదలికలపైన నిఘాను ఉంచినట్టు చెబుతున్నారు. గతంలో మావోయిస్టు పార్టీ ముమ్మరంగా కార్యకలపాలు సాగించిన తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని అన్ని గ్రామాలపైన ప్రత్యేకంగా దృష్టిసారించి కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల దంతెవాడ జిల్లాలో మావోయిస్టుపార్టీ సీఆర్పీఎఫ్ వాహనాన్ని పేల్చివేతలో పాల్గొన్న మావోయిస్టు బృందాలు పోలీసుల దృష్టిని మరలించేందుకు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని అటవీగ్రామాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్న దృష్ట్యా జిల్లాకు సరిహద్దుగా ఉన్న ప్రాణహితనది పరివాహకప్రాంతంలో ఇన్‌ఫార్మర్ నెట్‌వర్కను పోలీసులు అప్రమత్తం చేసినట్టు భావిస్తున్నారు.

Post A Comment: