మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య అని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. మహనీయుల జయంతి వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎన్టిపిసి ఎఫ్ సి ఐ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సమతా సైనిక దళ్ ఎన్టి పి సి పట్టణ కమిటీ అధ్యక్షులు ముడిమడుగుల సురేష్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమతా సైనిక దళ్ నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ముఖ్యఅతిథిగా
హాజరై దొడ్డి కొమరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వం ప్రధాన కారణం అని తెలిపారు. ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్‌ఖాన్ కాలంలో తెలంగాణ ప్రజలు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని. నిజాం అండదండతో గ్రామాల్లో జాగీర్‌దారులు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు దేశ్‌పాండేలు, దొరలు పేట్రేగిపోయి ప్రజలను విపరీతంగా పీడించేవారని తెలిపారు. అలాంటి వారిలో ఒకడు విస్నూర్ దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి. 60 గ్రామాలకు మకుటం లేని మహారాజుఅని. అతని ఆగడాలకు హద్దు, పద్దూ లేదని. పరమ కిరాతకుడని తెలిపారు. భువనగిరిలో 1944 ఆంధ్రమహాసభ (సంఘం) సమావేశం చైతన్యంతో కడివెండిలో గ్రామ సంఘం ఏర్పడిందని. ఊరి జనమంతా ఒక్కో ‘అణా’ చెల్లించి సంఘంలో జేరి, గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ఎదురు తిరిగారన్నారు. సంఘం అండతో దొరసాని జానమ్మకు పన్ను కట్టడం మానేశారని. పన్ను చెల్లించని వారిపైనా ముఖ్యంగా జానమ్మకు ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై ఒత్తిడి పెరగగా తన సోదరుడికి కొమురయ్య కూడా అండగా నిలబడ్డాడని తెలిపారు. ఈ సందర్భంగా దొరసానికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా 1946 జూలై 4న దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహా రెడ్డి నేతృత్వంలో ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహను హత్య చేయాలని కుట్రపన్ని అందులో భాగంగా దేశ్‌ముఖ్ అనుచరుడు మస్కీనలీ నాయకత్వంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చారని అన్నారు చీకటి పడే సమయంలో గుండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇండ్లపైకి రాళ్ళు రువ్వడం ప్రారంభిం చారన్నారు. సంఘం ఆర్గనైజర్ కె.రాంచంద్రారెడ్డితో పాటు రెండు వందలమందికి పైగా ప్రజలు ఆంధ్రమహాసభకు జై, సంఘం వర్ధిల్లాలి, దేశ్‌ముఖ్ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారన్నారు.
దొడ్డి కొమురయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిలిచాడని. గడ్డం నర్సింహరెడ్డి, మస్కీనలీ అనుచర గుండాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ర్యాలీ గఢీని సమీపించగానే జరిపిన తుపాకి కాల్పుల్లో ఓ తూటా దొడ్డి కొమురయ్య పొట్టలోకి దూసుకుపోగా, ‘ఆంధ్ర మహాసభకు జై’ అంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడని ఆవేదన చెందారు. కొమరయ్య మృత దేహాన్ని జనగాం తరలించి పోస్టుమార్టం నిర్వహించి నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చిపెట్టారని. కొమురయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు జరిగి తెలంగాణ కొలిమై మండడంతో సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైందన్నారు. దొడ్డి కొమురయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడన్నారు. యువత మహనీయుల స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేతకాని సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం నరసయ్య, సమతా సైనిక దళ్ నాయకులు దూటరాజు, చీదురు వసంతరావు, దూట అరవింద్, చందనగిరి శివ ప్రసాద్, నరసింహారెడ్డి, గటుకం కుమార స్వామి,పల్లె శ్రీనివాస్, మచ్చర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: