ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నిషేధ మావోయిస్టులకు ప్రజలు, గుత్తి కోయ ప్రజలు సహకరించవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె.సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అడవి ముత్తారం మండలం సింగారంలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జే. సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి మరియు మద్ది మడుగు, దండేపల్లి గుత్తి కోయ గుoపుల నుంచి 300 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం, పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలకు పోలీసుల సేవలను మరింత చేరువ చేసేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. గుత్తి కోయలు, మారుమూల గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజల, గుత్తి కోయల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిపుణులైన డాక్టర్ల బృందాన్ని పిలిపించి, ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని, ఉచితంగా మందులతో పాటు, మెరుగైన వైద్యం అవసరం అయిన వారిని పెద్ద ఆసుపత్రులకు పోలీసు శాఖ తరుపున తీసుకెళతానని అన్నారు. గుత్తి కోయలు, ప్రజలు మహిళలకు పోలీసులపై ఉన్న సదాభిప్రాయాన్ని, అలాగే ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఎస్పి పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బతుకుతున్న ప్రజలు, గుత్తి కోయలను అభివృద్ధి మార్గం వైపు ప్రయాణించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని, ముఖ్యంగా ప్రజలు, గుత్తి కో యలు తమ పిల్లల చదువును నిర్లక్యం చేయవద్దని అన్నారు. చదువు, క్రీడల్లో ప్రతిభ గల యువకులను ప్రోత్సహించడానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, అలాగే గుత్తి కోయల నీటి అవసరాలను తీర్చుతామని, అంతేకాకుండా వారి వివిధ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, గుత్తి కోయ గుంపుల్లో, మరియు గ్రామాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పి సురేందర్ రెడ్డి కోరారు. అనంతరం యువతకు, గుత్తి కోయ ప్రజలకు క్రీడా సామగ్రితో పాటు, దోమ తెరలు, అందించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి అశోక్ కుమార్, కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, సిఐ రంజిత్ రావు, ఎస్ఐలు నరేష్, సుధాకర్, శ్రీనివాస్, డాక్టర్లు, సురేష్, రామకృష్ణ, శ్యామ్, ప్రసాద్, సందీప్, శ్రీనివాస్, రఫీ, సింగారం గ్రామ సర్పంచ్ మొక్క రాజేశ్వరి పాల్గొన్నారు.


Post A Comment: