ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కాళేశ్వరం లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణతో పాటు, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో శుక్రవారం కాళేశ్వరంలో భద్రతా పరమైన చర్యలపై ఎస్పి పోలీసు అధికారులతో సిబ్బందితో సమీక్షించి, పలు సూచనలు సలహాలు అందజేశారు. అంతకుముందు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, వాహనాల మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలు, దేవాలయం వద్ద భద్రతను ఎస్పి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ భక్తుల భద్రత ధ్యేయంగా పోలీసుశాఖ పనిచేస్తుందని, ప్రజలు, భక్తులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం మొత్తం సిసి కెమెరాల నిఘా లో ఉందని అన్నారు. 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, పోలీసు అధికారులు, సిబ్బంది భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే నది ప్రవాహం నేపథ్యం లో ఘాట్ ల వద్ద, నిర్దేశిత ప్రదేశాల్లో స్నానాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, మహాదేవ్ పూర్ సీఐ కిరణ్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, జిల్లా పరిధిలోని సీఐ లు, ఎస్సై లు పాల్గొన్నారు.
Post A Comment: