ముఖ్య సంచలక్ / అనపర్తి సాయితేజ
కాళేశ్వరం ప్రాజెక్టు బాధిత రైతులు తమ పట్టు వీడలేదు. లక్ష్మీ బ్యారేజి బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న భూములకు పరిహారం ఇచ్చే వరకూ వదిలేది లేదని నిరవధిక నిరసలకు పూనుకున్నారు. 36 రోజులుగా సిరొంచలో సాగుతున్న ఈ నిరసనలకు తోడు నాగ్ పూర్ అసెంబ్లీ వద్ద కూడా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. శీతాకాల సమవేశాలు నాగ్ పూర్ అసెంబ్లీలో కొనసాగుతున్న నేపథ్యంలో తమ గోడు వెల్లబోసుకునే అవకాశం వచ్చిందని సిరొంచ తాలుకా రైతులు అసెంబ్లీ వద్ద మూడు రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న అహేరీ ఎమ్మెల్యే ధర్మరావు బాబా ఆత్రం లక్ష్మీ బ్యారేజి బాధితుల నిరసన శిబిరం వద్దకు చేరుకుని ముఖ్యమంత్రితో అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అపాయింట్ మెంట్ తీసుకున్న ఎమ్మెల్యే ఆత్రం.. అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో రైతులను తీసుకెల్లి కలిపించారు. సిరొంచ తాలుకాలోని రైతాంగం సమస్యలు మొత్తం విన్న డిప్యూటీ సీఎం సమస్యలు పరిష్కరానికి వారికి భరోసా ఇచ్చారు.
అన్ని పరిష్కరిస్తా: ఫడ్నవిస్
సిరొంచ తాలుకాలోని లక్ష్మీ బ్యారేజి రైతులతో కూలంకశంగా చర్చించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫఢ్నవిస్ అన్ని రకాలుగా సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికే నోటిఫై అయిన 130 హెక్టార్ల భూమికి సంబందించిన పరిహారం వెంటనే ఇప్పించడంతో పాటు అదనంగా ముంపునకు గురువుతున్న భూముల గురించి ప్రత్యేకంగా సర్వే చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. లక్ష్మీ బ్యారేజి బ్యాక్ వాటర్ తో ఇప్పటికే నోటిఫై చేసిన భూములు కాకుండా అదనంగా ముంపునకు గురవుతున్న భూముల గురించి పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఆ రైతాంగానికి కూడా పరిహారం ఇచ్చేందుకు చొరవ తీసుంటామని అన్నారు.
రైతుల్లో ఆనందం
తమ సమస్య పరిష్కారం కోసం ఇన్నాళ్లు పడ్డ శ్రమకు భరోసా దక్కడంతో సిరొంచ తాలుకా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులే స్వయంగా తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ 36 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిరొంచలో భారీ జనసమీకరణలు నిషేధమని పోలీసులు ప్రకటించడంతో వ్యూహత్మకంగా వ్యవహరించిన రైతులు రోజుకు నలుగురు చొప్పున సిరొంచ తాలుకా కేంద్రంలోని నిరసన శిబిరంలో బైఠాయించారు. డిసెంబర్ 2 నుండి 8 వరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు ఉన్నాయని, నిరసనలు నిలిపివేయాలని పోలీసులు రైతులకు సూచించారు. వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన రైతులు డిసెంబర్ 9 నుండి తిరిగి యథావిధిగా తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. ఈ సారి అసెంబ్లీ సెషన్స్ నాగ్ పూర్ లో జరుగుతున్నాయని సమాచారం అందుకుని రైతాంగం అక్కడకు వెల్లి ఆందోళన చేపట్టింది. దీంతో అహేరీ ఎమ్మెల్యే ధర్మరావు బాబా ఆత్రం చొరవ తీసుకుని డిప్యూటీ సీఎంను కలిపించడంతో వారి సమస్యకు పరిష్కారం దొరికినట్టయింది. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సానుకూలంగా స్పందించారని, శుక్రవారం సిరొంచలో లక్ష్మీ బ్యారేజి బాధిత గ్రామాల రైతులతో సమావేశం అయి జరిగిన విషయాన్ని వివరిస్తామని రైతులు తెలిపారు.


Post A Comment: