ముఖ్య సంచాలక్ / అనపర్తి సాయితేజ
మహారాష్ట్ర రైతులు తమ నిరసనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తమకు న్యాయంగా పరిహారం చెల్లించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. తాజాగా సోమవారం నుండి నిరవధిక నిరసనలకు శ్రీకారం చుట్టారు మహారాష్ట్ర రైతులు.
నలుగురి కోసం భారీ బందోబస్తు..
ఓ ఫ్లెక్సీ పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ నలుగురు వ్యక్తులు నడుచుకుంటూ వెల్తుంటే.. పదుల సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి. మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా కేంద్రంలో సోమవారం మేడిగడ్డ కారణంగా నష్టపోతున్న తమను ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నారు. నాలుగేళ్లుగా మేడిగడ్డ బ్యారేజీ కారణంగా తాము పంటలు వేసుకునే పరిస్థితి లేదని తమకు పరిహారం చెల్లించాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుండి ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపించడం, సిరొంచ తాలుకా కేంద్రంలో నిరసనలు తెలియజేయడం వంటి చర్యలకు పూనుకున్నా ఎలాంటి స్పందన మాత్రం లేకుండా పోయిందని సిరొంచ రైతులు తెలిపారు.
దీంతో సోమవారం నుండి నిరవధిక నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకుని స్థానిక తహసీల్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ ముందుగానే దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆదివారం సాయంత్రం ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని పోలీసులు బాధిత గ్రామాల రైతులకు సూచించారు. పోలీసు యాక్టుతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులుగా జనం జమ కాకూడదని చెప్పారు. దీంతో రైతులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నలుగురు మాత్రమే ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. బాధిత గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున సిరొంచకు చేరుకున్నప్పటికీ ఆందోళన శిబిరానికి దూరంగా ఉండిపోయారు. పోలీసులు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైతులకు తెలపడంతో వారు దూరంగా ఉంటూ ఆందోళనకు సంఘీభావం చెప్తున్నారు.
నిఘా వర్గాల అలెర్ట్... ?
అయితే సిరొంచలో చేపట్టే నిరవధిక ఆందోళన కాస్తా రెండు రాష్ట్రాలకు వేదికగా మారే అవకాశం ఉందని నిఘా వర్గాలకు ముందస్తుగానే సమచారం అందినట్టు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కారణంగా పంటలు కోల్పోతున్న తెలంగాణ సరిహద్దు గ్రామాలకు చెందిన రైతులు కూడా సిరొంచ తాలుకా రైతులు చేపట్టే ఆందోళనల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు గోదావరి పరివాహక గ్రామాల రైతులు సమాయత్తం అవుతున్నారని కూడా మహారాష్ట్ర పోలీసులు సమాచారం అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం.



Post A Comment: