మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: విఘ్నేశ్వరుని నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలు జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని,ఇందుకు ప్రజలు,భక్తులు సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి కోరారు. బుధవారం త్రివేణి సంగమం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రదేశాలను క్షుణంగా పరిశీలించిన ఎస్పీ. బందోబస్తు ఏర్పాట్లతో పాటు,గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేసేందుకుగాను క్రేన్ల వినియోగం,సిసి కెమెరాలు,గజ ఈతగాల్ల ఏర్పాట్లతో పాటు,నిమజ్జనం జరిగే సమయంలో పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధులతో పాటు,ప్రతిమలను తీసుకువచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి,వాహనం తిరిగి వెళ్ళే మార్గాలకు
సంబంధించిన విధివిధానాలను స్థానిక పోలీసులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 31తేదీ నుండి ప్రారంభమైన గణేష్ నవరాత్రుల ఉత్సవాలు,ఈ నెల 9వ తేదిన గణేష్ నిమజ్జనంతో పూర్తవుతాయని, ఇందుకోసం కట్టుదిట్టమయిన బందోబస్తు చర్యలు తీసుకున్నామన్నారు.గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు.ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా చూడాలని,మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని,వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
శోభాయాత్రలో డిజె లు వినియోగించవద్దని ఎస్పి స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు తగిలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇతర వర్గాలను గాని, మతాలను గాని,లేక వ్యక్తులను గాని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి చర్యలు చేయవద్దని,
వినాయక నిమజ్జనo చేసే చెరువులు,కుంటలు,నదుల వద్ద ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి సూచించారు.జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, సమస్యలు సృష్టించే ప్రయత్నం ఎవరూ చేసినా, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా,నిభంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఎస్పి హెచ్చరించారు.ప్రశాంత వినాయక నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పి సురేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం లో కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు,ఏ ఎస్సై రాజేశం,సివిల్,సీఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: