ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా యువత, ప్రజలు అప్రమత్తం గా ఉంటూ, అపరిచిత వ్యక్తుల, మావోయిస్టుల సమాచారం పోలీసులకు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి శుక్రవారం కోరారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రాంతంలో చొరబడి అమాయక ప్రజలను ఇన్ఫార్మర్ నెపంతో టార్గెట్ చేస్తూ చంపుతున్నారని, మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల అభివృద్దికి అడ్డుకట్ట వేస్తున్న మావోయిస్టులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మావోయిస్టులను గ్రామాలలోకి రాకుండా పారద్రోలి బంగారు భవిష్యత్తుకు ప్రజలు పునాది వేయాలని ఎస్పి పేర్కొన్నారు. నక్సలిజంతో సాధించేది ఏమి ఉండదని, అభివృద్ధి తోనే ప్రజల భవిష్యత్తు మారుతుందని అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న మావోయిస్టులకు ప్రజలు, యువత సహకరించవద్దని ఎస్పీ సురేందర్ రెడ్డి కోరారు. మావోయిస్టుల సమాచారం ఇస్తే దాదాపు రూ. 5 లక్షల నుండి 20 లక్షల వరకు పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, సహకరిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలనీ, పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 9,10 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం ఉందని, వారి ఆచూకీ తెలిపిన వారు SP భూపాలపల్లి, 8332841100, OSD 9440904697, DSP కాటారo 8333923857 మొబైల్ నెంబర్లకు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, వారికి నగదు రివార్డు అందజేస్తామని ఎస్పి సురేందర్ రెడ్డి తెలిపారు.

Post A Comment: