భూపాలపల్లి జిల్లా : మేడారం సమీప అడవుల్లో ఒక యువకుడి మృతదేహం లభించడంతో కలకలం రేగింది. మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాసిత్(21)ను నరమేధం చేశారని పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల వివరాల ప్రకారం –
భూపాలపల్లి పట్టణానికి చెందిన బాసిత్ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గల్లంతైన తన కొడుకును వెతికినా ఎటువంటి సమాచారం దొరకకపోవడంతో తల్లి సబియా పోలీసులను ఆశ్రయించింది. తన కుమారుడిని కిడ్నాప్ చేశారని, పట్టణానికి చెందిన పలువురు యువకులపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం మేడారం సమీపంలోని అడవిలో బాసిత్ మృతదేహం కనిపించడంతో కలకలం చెలరేగింది. దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పారేసినట్లు పోలీసులు గుర్తించారు. కాళ్లు, చేతులు కట్టేసి, పైగా పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని సందేశాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాసిత్ పెట్టిన పోస్టుల విషయంలో ఇతరులతో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. అదే రగడ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసులో కీలక మలుపులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ దారుణ ఘటనతో భూపాలపల్లి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యువకుడిని ఇంత క్రూరంగా హతమార్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భద్రతను పెంచి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Post A Comment: