జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం (సరస్వతి) బ్యారేజీ వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. చేపల వ్యాపారానికి ఉపయోగించే ఓ చిన్న పడవ గోదావరిలో మునిగిపోవడంతో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మహారాష్ట్ర శిరోంచ తాలూకాకు చెందిన గడ్డం వెంకటేశ్, కృష్ణ స్వామి ఇద్దరూ మంచిర్యాల జిల్లా పొక్కుర్ గ్రామం నుంచి చేపలు పట్టే పడవ కొనుగోలు చేశారు. ఆ పడవను గోదావరి మార్గం ద్వారా స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరిద్దరూ అన్నారం బ్యారేజీ గేట్ల దగ్గరికి చేరుకునే సరికి పడవ నియంత్రణ తప్పింది. భారీగా ప్రవహిస్తున్న నీటికి గేట్లను ఢీకొనడంతో పడవ బోల్తా కొట్టింది. ఇందులో గడ్డం వెంకటేశ్ గల్లంతవగా, కృష్ణ స్వామి అయితే తన్నుకొస్తూ కాపాడుకున్నాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతైన వెంకటేశ్ కోసం గోదావరిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నదిలో పడవలు, బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. ప్రతీ వర్షాకాలంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బ్యారేజీ వద్ద అదనపు హెచ్చరిక బోర్డులు, భద్రతా చర్యలు ఉండాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులు, పడవదారులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.“బోటు ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం తర్వాత ఇస్తాము” అని స్థానిక పోలీసులు తెలిపారు.

Post A Comment: