ఉమ్మడి వరంగల్ : మాడుగుల శ్రీనివాస శర్మ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని భద్రకాళీ దేవాలయం మాఢ వీధుల నిర్మాణం, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనులు, వేయి స్తంభాల దేవాలయం, సివిల్ సప్లై గోదాంలు, కాజీపేట ఆర్ఓబి, తదితర అభివృద్ధి అంశాలపై కుడా ఛైర్మన్ ఇనగల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, భూమి కొలతల శాఖ ఏడి శ్రీనివాసులు, ఇతర శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా అభివృద్ధి పనుల పురోగతి, తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా భద్రకాళి మాఢ వీధుల నిర్మాణంపై కుడా పిఓ అజిత్ రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి దేవాలయ మాఢ వీధుల నిర్మాణంలో భాగంగా 800 మీటర్లకు గాను ఇప్పటివరకు 400 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయని మిగతా పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ మాఢ వీధుల నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. కాజీపేట ఆర్ఓబి పనులు వేగంగా జరగాలని ఎమ్మెల్యే అన్నారు. ఆర్ఓబి పనుల విషయంలో జాప్యం చేయకుండా త్వరగా పూర్తయ్యే విధంగా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్, కమిషనర్,అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.ఈ సమావేశంలో కుడా ఈఈ భీమ్ రావు, హౌసింగ్, రెవెన్యూ, సర్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: