ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ 
 సమాజ మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో హనుమకొండ జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకుని గురు పూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి డాక్టర్ బండా ప్రకాష్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, డీఈవో వాసంతి, తదితరులు పూలమాలలు వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర శాసనమండలి వైస్ చైర్మన్  డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ విద్య ఇచ్చిన గొప్ప అవకాశం తోనే ఈ స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులే తనను ప్రభావితం చేశారని  అన్నారు. 
పాఠశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తన ఉపాధ్యాయులు, అధ్యాపకుల బోధనలతో తీర్చిదిద్దడం వల్లనే  ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. జిల్లాలో 1,45,294 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండడం చాలా గొప్ప విషయం.. అభినందనీయమని అన్నారు. కొన్ని జిల్లాల్లో చదువుకునే వారి సంఖ్య తక్కువ శాతం ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య  ఎక్కువగా ఉండడానికి గల కారణాలను గతంలో పరిశీలించిన అనంతరం జిల్లాలో దాదాపు 22 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులకు నిధులు ఇవ్వడం  జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ  డిజిటల్ విద్యా బోధన విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.    కొన్ని గ్రామాలలో వివిధ కారణాల వల్ల ఉపాధ్యాయుల సంఖ్య ఉన్నప్పటికీ విద్యార్థులు లేరని అన్నారు. 
శాసనమండలి సమావేశాలలో ఒకరోజు విద్య పైనే సమావేశం  పెట్టామని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి సహా పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి  ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.  విద్యారంగంలో మనం చేయాల్సిన కృషి  ఇంకా ఎంతో ఉందన్నారు. సమాజం పట్ల ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమాజ లక్ష్యాలను చేరుకునే విధంగా  విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన సామర్థ్యాలు మరింత మెరుగుపడాలన్నారు. అభ్యసన పద్ధతులను ఉపాధ్యాయులు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్ధమైనరీతిలో  ఉపాధ్యాయులు బోధించాలన్నారు. స్ఫూర్తిగా నిలిచే ఉపాధ్యాయుల కథనాలను చదివి అదే నమూనాలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధనను  అందించాలని కోరుకుంటామని అన్నారు. ఎంతోమంది ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ పాఠశాలలకు సదుపాయాలు, విద్యార్థులకు సహాయం చేస్తుండడం చూస్తుంటామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గ నిర్దేశకుడిగా, సలహాదారుగా వ్యవహరించాలని కోరారు. విద్యారంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు విజయవంతంగా అమలు కావాలన్నారు. జిల్లాలో సైన్స్ ఫెయిర్ బాగా జరుగుతున్నాయని, గతంలో మాదిరిగానే సృజనోత్సవం  కార్యక్రమాలను తిరిగి ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన నిర్వహించాలని సూచించారు. సృజనోత్సవం కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి దోహదపడుతుందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన  ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించడానికి, ఎదగడానికి విద్యనే సహాయపడుతుందని  అన్నారు. దేశానికి ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు, వివిధ రంగాల వారిని అందించే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారని  అన్నారు. ఉపాధ్యాయులు ఒక్క విద్యారంగంలోనే కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. తన దృష్టిలో  ప్రతి టీచర్ బెస్ట్ యేనని, ఆర్డినరీ టీచర్ అంటూ ఎవరు ఉండరని అన్నారు. తాను వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో  విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను చూస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత ప్రతిభను గుర్తించి వారిని ముందుకు నడిపేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు.  విలువలు కలిగిన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందటం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏదైతే బోధిస్తారో అది గుర్తుండి పోతుందన్నారు. ప్రతి టీచర్ ఏదో ఒక విషయంలో గొప్పగా ఉంటారని అందుకే ప్రతి టీచర్ ఉత్తములేనని పేర్కొన్నారు. సమాజం బాగుపడాలంటే అది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమని అన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి డి. వాసంతి మాట్లాడుతూ పాఠశాల విద్యలో హనుమకొండ జిల్లా ముందుందని అన్నారు. జిల్లాలో 873 పాఠశాలలు ఉన్నాయని, ఒక లక్షకు పైగా  విద్యార్థులు అభ్యసిస్తున్నారని తెలిపారు. విలువలతో కూడిన భావి భారత పౌరులుగా  విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యారంగంలో దేశంలోనే జిల్లాకు మంచి స్థానంలో నిలబెట్టే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. హనుమకొండ జిల్లాలో 45 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించామని, 500 వరకు ప్రవేశాలు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రవేశాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల పురోగతికి జిల్లా కలెక్టర్  అందిస్తున్నారని అన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో  అనుకున్న వాటికంటే  ఎక్కువ అడ్మిషన్స్ రావడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో  చేపట్టిన ప్రగతి వివరాల నివేదికను  వివరించారు. సమావేశం అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 55 మంది  ఉపాధ్యాయులను డాక్టర్ బండా ప్రకాష్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , డీఈఓ వాసంతి శాలువాలు, ప్రశంసా పత్రం, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని తెలియజేస్తూ పలువురు ఉపాధ్యాయులు స్ఫూర్తి గీతాలను ఆలపించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్ విద్యార్థినులు చేసిన స్వాగతం నృత్యం ఆకట్టుకుంది. ఈ సమావేశంలో మైనారిటీ కమిషన్ సభ్యులు దర్శన్ సింగ్, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానసరాంప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: