ఉమ్మడి వరంగల్ : మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా లోని వరద సహాయక చర్యలను అధికారులు పకడ్బందీగా అందించాలి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం భారీ వర్షాలు , వరద సహాయం పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు , పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వరదల వల్ల మరమ్మతులకు గురైన పంచాయతీ రోడ్లు, రోడ్లు భవనాల శాఖ రోడ్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల క్రింద పునరుద్ధరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. విపత్తుల కారణంగా జరిగిన మానవ ప్రాణ నష్టం, పశువుల ప్రాణ నష్టం కు అందించే పరిహారం సైతం డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు వినియోగించాలని సీఎం అధికారులకు తెలిపారు.
వరదల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు రాష్ట్రం వద్ద అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారని, గత వరదల సమయంలో వినియోగించిన నిధులను పూర్తి స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రింద జమ చేసి కేంద్రం నుంచి మరింత సహాయం రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్ నెలాఖరు వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు యూసీ లను సమర్పించాలని సీఎం ఆదేశించారు. గతంలో వరదల సమయంలో పాడైన రోడ్ల మరమ్మత్తు పనుల కు ఖర్చు చేసిన నిధులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నమోదు చేస్తూ వివరాలు అందించాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఆగస్టు నెలలో కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా లభించిందని, వీటికి పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. ఆగస్టు నెలలో కురిసిన వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 732 కోట్ల విలువ గల 1009 కిలో మీటర్ల ఆర్&బీ రోడ్లు, జాతీయ రహదారులు, 374 కోట్ల విలువగల 577 కి.మీ ల పంచాయతీరాజ్ రోడ్లు, 32 కోట్ల 73 లక్షల విలువ గల విద్యుత్ శాఖ పరికరాలు, 8.95 కోట్ల విలువ గల మిషన్ భగీరథ పైప్ లైన్ లు దెబ్బతిన్నాయని అన్నారు.
సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు.వరద సహాయక చర్యలకు కలెక్టర్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అక్కడ వారికి అవసరమైన వైద్యం ఆహారం ఇతర ఏర్పాట్లు చేయాలని అన్నారు.
వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్, ఇతర పరికరాలు ఫీల్డ్ లో సిద్ధం పెట్టుకోవాలని, విద్యుత్ సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లు సన్నద్ధం చేయాలని, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు.
వరదల గురించి ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో, ఎఫ్.ఎం రేడియో , వివిధ మాధ్యమాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలని అన్నారు.
ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనల పై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని , ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును కలెక్టర్లు పర్యవేక్షించాలని అన్నారు.
ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ, ఆగస్టు 26 నుంచి 28 తేదీలలో భారీ వర్షాలు మన రాష్ట్రంలో కురిసాయని ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురువడంతో ప్రాథమిక అంచనా ప్రకారం 4124 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అన్నారు. జాతీయ రహదారి 44 కు చాలా చోట్ల పెద్ద డ్యామేజీ జరిగిందని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ భాజ్ పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: