ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధిని రూ. 4.29 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా ) రూ. 4.29 కోట్ల నిధులతో నిర్మించిన ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, హైమావతి, సిద్దిపేట అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి సెంట్రల్ లైటింగ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కుడా నిధులతో ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఎల్కతుర్తి అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రి ఉన్నతీకరణ, విద్యుత్ ఉపకేంద్రం, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు మంజూరు అయి ఉన్నాయని అన్నారు. బాసర ఐఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు స్థల సేకరణతో పాటు ఇతరత్రా కారణాలవల్ల ఆలస్యమైందని, కానీ వచ్చే ఏడాది తప్పకుండా తీసుకువస్తామన్నారు. వంగరలో కూడా నవోదయ విద్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతుందని, వీలైనంత తొందరలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడం జరిగిందని, ఐదు కోర్సులతో తరగతులు జరుగుతున్నాయన్నారు. కోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ జరుగుతుందని, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ ఆసుపత్రిని 150 నుండి 250 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి పీజీ కోర్సులకు అందించే విధంగా వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. త్వరలో వీటిని ప్రారంభించుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, కుడా సిపివో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, విద్యుత్ శాఖ అధికారులు, మండల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.


Post A Comment: