ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో భక్తిశ్రద్ధలతో గణపయ్యను తమ ఇళ్లలో, మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు.
వరంగల్ ఎల్లంబజార్లో 45 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డాల్ఫిన్ గల్లీలో సుతిల్ తాళ్ల (జూట్ రోప్స్) తో తయారు చేసిన ప్రత్యేకమైన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ, ఉత్సవ నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విగ్రహాలను మండపాలకు తరలించి వేడుకలను కొనసాగించారు. ప్రజలు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా గణపతి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ ఇళ్లలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా గణపతి వేడుకల సందడి కొనసాగుతోంది. ప్రజలు తమ ప్రాంతంలో ప్రతిష్ఠించిన గణపయ్య విగ్రహాల చిత్రాలను, వీడియోలను షేర్ చేస్తూ వాటి విశేషాలను పంచుకుంటున్నారు. ఈ గణపతి ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో భక్తి, ఐక్యతను చాటుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.
Post A Comment: