ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాద్యత జిల్లా కలెక్టర్లదేనని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు సామాన్యులకు అందుతాయని అన్నారు. మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సామాన్యులను ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని సస్సెండ్ చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. క్షేత్రస్ధాయిలో కొంతమంది అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం ఉందని ఇది పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
రెవెన్యూ సదస్సుల్లో 8.65లక్షల దరఖాస్తులు వచ్చాయని ఇందులో ప్రధానంగా సాదాబైనామా, సర్వేనెంబర్ మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్ , అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్ కు సంబంధించి సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయని వీటిని ఐదు విభాగాలుగా విభజించి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన జరిపి ఆగస్లు 15వ తేదీలోగా వీలైనన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. సాదాబైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కోర్టు తీర్పుకోసం వేచిచూడకుండా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లాల్లోని అసైన్డ్‌ల్యాండ్, లబ్దిదారుల వివరాలను ఈ నెల 30వ తేదీ లోగా ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్లకు సూచించారు. దరఖాస్తుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించకూడదని, తిరస్కారానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్దాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిపీవోలకు , జె ఎన్ టి యు ఆధ్వర్యంలో లైసెన్స్ డ్ సర్వేయర్లకు పరీక్ష నిర్వహిస్తున్నామని ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకొని పకడ్బందీగాపరీక్ష నిర్వహించాలన్నారు.
ఇంటి నిర్మాణంలో పేదవాడికి ఏ సమస్య రాకూడదు
పేదవాడి సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల నిర్మణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ధరలు, చెల్లింపులు, ఇసుక, సిమ్మెంట్, స్టీల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ సమస్య రాకుండా చూడాలని అలాగే ధరల నియంత్రణ కమిటీ చురుగ్గా పనిచేసేలా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని , ఇది సరైన విధంగా లబ్దిదారులకు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులపై రవాణా భారం అధికంగా పడకుండా వీలైనంత దగ్గరలో ఇసుక అందేవిధంగా చూడాలన్నారు. బేస్‌మెంట్ నిర్మాణం కోసం అక్కడక్కడ అందుబాటులో ఉన్న మట్టిని తీసుకెళ్తున్న లబ్దిదారులపై పోలీసులు కేసులు నమోదుచేయడం సరైన చర్య కాదని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కలెక్టర్లు, సి. పి, ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలతో సంబంధం లేకుండా నిరుపేదలైతే ఇల్లు కేటాయించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నాకూడా ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని అయితే సాంకేతిక సమస్యలతో కొంతమంది లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని ఇటువంటి సమస్యలను ముందుగానే గుర్తించి లబ్దిదారునికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 2 బిహెచ్‌కే ఇండ్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైనలబ్దిదారులకు కేటాయించాలన్నారు.
ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో పథకాల ఫలితాలను వారికి అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, దానికగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించు కోవాలని మంత్రులు స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం సరఫరా...
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల కనుగుణం సాంఘిక, బిసి, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, హాస్టళ్లలో నిర్వాహణపై ఎప్పుటికప్పుడు తనిఖీలు నిర్వహించి వారంలో ఒక్కరోజు అధికారులందరూ ఆ హాస్టళ్లలో బస చేయాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు వీటి నిర్వాహణపై పలు సూచనలు చేశారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమారులు జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. హాస్టళ్ల ప్రాంగణాల్లో పచ్చదనం పరిశుభ్రతల్లో భాగంగా శానిటేషన్‌ను చేపట్టాలని, అన్ని జిల్లాల్లో ఎగ్ టెండర్స్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా రేపటికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, ఈ సందర్భంగా 97 బస్సు డిపోలు, 321 బస్‌స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి...
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జి డబ్ల్యు ఎం సి కమిషనర్ చాహత్ బాచ్ పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, డీఎంహెచ్వో అప్పయ్య, డీఈఓ వాసంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: