ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ అన్నారు. బుధవారం హనుమకొండ కుడా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పై వెరిఫికేషన్ అధికారులతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలోని గ్రామాల, గ్రేటర్ వరంగల్ నగరంలోని వార్డుల వారీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పాటిస్తున్న వేరిఫికేషన్ ప్రక్రియ, అర్హులు, అనర్హుల జాబితాను ఎలా గుర్తిస్తున్నారు, ఇండ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయి, తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి. పి.గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్న డేటా తో వెరిఫికేషన్ క్షేత్ర స్థాయిలో సరిచూసుకున్న తరువాతనే నియోజక వర్గ నోడల్ అధికారి ద్వారా జాబితాను కలెక్టర్ లాగిన్ కు పంపాలన్నారు. పైలట్ గ్రామాలలో ఇప్పటి వరకు ఇండ్లు ప్రారంభం కాని వారి స్థానంలో ఇతర గ్రామానికి చెందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. వర్ధన్నపేట పరిధిలో పలు ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెరిఫికేషన్ అధికారి చెప్పడంతో హౌసింగ్ ఎండీ గౌతమ్ అభినందనలు తెలిపారు. లబ్ధిదారు వేగంగా ఇల్లు నిర్మాణంలో స్లాబ్ పూర్తి చేసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ప్రాతిపాదికగా తీసుకోవాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు. లబ్దిదారుడు సరసమైన ధరలో దశలవారీగా
ఇండ్ల నిర్మాణం చేసుకునేలా
ప్రతి దశలో అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని అన్నారు.
ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన
ఏఈ లను ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని, ఆ తదుపరి త్వరలో నగరంలో చేపట్టే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వార్డులలో అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇందిరమ్మ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, ఆ తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న దృష్ట్యా లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ సామగ్రి ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు మాట్లాడనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ అధికారులు, మండలాల తాపీ మేస్త్రి సంఘాలతో త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల జాబితా వెరిఫికేషన్ లో అర్హులు, అనర్హుల జాబితాను సరిచూసుకోవాలన్నారు.వరంగల్ జిల్లాతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు గ్రేటర్ వరంగల్ పరిధిలోని సోమిడి, వడ్డేపల్లి, దేశాయిపేట ప్రాంతాల్లో వేరిఫికేషన్ అధికారులు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎండి విపి గౌతమ్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే తో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పారదర్శక నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్, జిల్లా నోడల్ అధికారులు రామిరెడ్డి, రవీందర్ నాయక్, నియోజకవర్గ నోడల్ అధికారులు, వెరిఫికేషన్ అధికారులు తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: