మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, "రేవంత్ రెడ్డి పూర్తిగా మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయి. కేవలం రాహుల్ గాంధీని మెప్పించడం కోసమే ఇలాంటి అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తన స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాట్లాడే స్థాయి ఆయనకు లేదు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న మోదీని విమర్శించడం సిగ్గుచేటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, "ప్రధాని పదవి కోసం జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని విభజించారని చరిత్ర చెబుతోంది. రేవంత్ రెడ్డి చరిత్రను మరచిపోయినా, దేశ ప్రజలు ఆ చేదు నిజం ఎప్పటికీ మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం దేశాన్ని ముక్కలు చేసింది. ఇప్పుడు బీజేపీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం" అని మహేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.
మహేశ్వరరెడ్డి ఇంకా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తెలంగాణను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. "రాజ్యాంగేతర శక్తి అయిన మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్‌లోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు. ముఖ్యమంత్రి లేని సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి సెక్రటరియేట్‌లో సమీక్షలు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్య" అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి తక్షణమే తన తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులను కించపరిచేలా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
Post A Comment: