పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా అన్నారు. నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ ద్వారా పేద ప్రజలకు పోషకాహారం అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతోందని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా యంత్రాంగం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ లబ్ధిదారుడి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనంలో పాల్గొన్నారు. సాదాసీదాగా ఉన్న ఆ ఇంట్లో వారితో కలిసి భోజనం చేయడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మంత్రి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేములూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దండు రమేశ్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ రఘురాం నాయక్, కాంగ్రెస్ నాయకులు సందీప్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి, కలెక్టర్ తమ ఇంటికి వచ్చి భోజనం చేయడం పట్ల లబ్ధిదారుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Post A Comment: