ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శనివారం సాయంత్రం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ప్రజ్వల్ సంస్థల ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం 2008 నుంచిప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో అనేక పర్యావరణహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన మేరకే విద్యుత్ లైట్లు,ఇతరత్రా అవసరాలకు విద్యుత్తు ను వినియోగించుకోవాలని, అనవసరమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకున్నట్లయితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు.
సోలార్ పవర్ వినియోగం, పునరు పునరుజ్జీవ వనరుల వినియోగంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన రావాలి. తడి పొడి చెత్త వేరు చేయడం ద్వారా పునర్వినియోగం, రీసైకిల్ చేయవచ్చునని అన్నారు. దీని గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కాకుండా స్టీల్ వాటర్ బాటిళ్లను వినియోగించడం వల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకొని తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకునేలా ప్రజల్లో చైతన్యం వచ్చినట్లయితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువులు కాకుండా పర్యావరణహితమైన వర్మి కంపోస్టు ఎరువులను వినియోగించేలా రైతులను ప్రోత్సహించిన ఉమ్మడి జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ చేతులుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ ఫరిదా మాట్లాడుతూ భూతాపం నుండి ధరిత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్, మారి, ప్రజ్వల్, తదితర సంస్థల ప్రతినిధులు వంశీకృష్ణ, వరంగల్ డీసీవో సంజీవరెడ్డి, ఇతర అధికారులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: