రైతుల దుస్థితిపై ఆందోళన:
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో రైతుల దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటం వల్ల వారికి పిల్లలను ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ఒక రైతు తన కుమార్తెను మరో రైతుకు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వాలు తమ ఉచిత పథకాలతో రైతులను యాచకులుగా మారుస్తున్నాయని ఆయన విమర్శించారు.
రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని ఆయన అన్నారు. రైతు జీవితానికి గ్యారెంటీ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 వరకు ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతుల నుంచి వివరాలు తీసుకొని సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతులకు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులను పెట్టి భూసేకరణ చేయడం సరికాదని ఆయన అన్నారు. రైతులతో చర్చించి భూమికి బదులు భూమి ఇవ్వాలని, 2013 చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ రేటుకు మూడింతలు కలిపి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Post A Comment: