హన్మకొండ ;
నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పిసీలు అంకితభావంతో, నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 9 నెలల బేసిక్ శిక్షణను పూర్తిచేసుకుని జిల్లాకు వచ్చిన పోలీసు కానిస్టేబుల్లతో ఎస్పి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
పోలీస్ ఉద్యోగం అనేది నిత్యం ఒత్తిడి తో కూడుకున్న ప్రొఫెషన్ అని, ప్రతికూల పరిస్థితులలో కూడా ఉద్యోగం చేయవలసి ఉంటుందని అన్నారు. జిల్లా నుండి పోలీస్ శాఖకు మొత్తం 52 మంది అభ్యర్థులు ఎపికయ్యారని, 6 మంది సివిల్, 46 మంది సాయుధ దళ (AR) కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. పోలీసు శాఖ ప్రధానంగా ప్రజల రక్షణ కోసం పనిచేస్తుందని, పౌరుల హక్కులు, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాల ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే
శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. నేరాల నియంత్రణ , కొత్త టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు దేశంలో గుర్తింపు ఉన్నదని, యూనిఫాంలో నూతన కానిస్టేబుళ్లు చేసే పనులను ప్రజలు గమనిస్తుంటారని, మంచి నడవడికతో పోలీసు ప్రతిష్టను పెంపోందించడానికి కృషి చేయాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, నగేష్, రత్నం, కిరణ్, శ్రీకాంత్ నూతన కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Post A Comment: