హన్మకొండ ;
భద్రకాళి చెరువు పూడికతీత పనులకు అధికారులు సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో వివిధ అభివృద్ధి, వాటి పురోగతి కి సంబంధించిన అంశాలపై రెవెన్యూ, సాగునీటిపారుదల, కుడా, మున్సిపల్, జిల్లా పంచాయతీ, మత్స్య, దేవాదాయ తదితర శాఖల అధికారులతో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భద్రకాళి చెరువు లో పూడిక తీత పనులను చేపట్టెందుకు అధికారులు సమన్వయంతో అన్నీ చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువులో ఉన్న నీటిని పూర్తిగా తీసివేసిన అనంతరం పూడికతీత పనులు చేపట్టాలన్నారు. చెరువు నీరు బయటకు తీసేటప్పుడు నగరం నుండి వెళ్తున్న మురుగునీటి కాల్వలలో చెత్తచెదారం, ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో కల్వర్టు లు ఉన్నచోట్లా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని తొలగిస్తే ఎక్కడ ఆగకుండా నీరు సాఫీగా వెళ్తుందన్నారు. నగరంలో 382 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భద్రకాళి చెరువులో పూడికతీత చేయకపోవడం వల్ల నీటి సామర్థ్యం తగ్గిందని, వర్షాకాలంలో బొంది వాగు వరద నీరు భద్రకాళి చెరువులో నిలవ ఉండడంతోపాటుగా భూగర్భ జలాలు పెరిగే విధంగా వెంటనే భద్రకాళి చెరువును పూడిక తీయవలసిందిగా నిర్ణయించ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు చెరువులో ఉన్న నీటిని తొలగించుటకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాపువాడ వద్ద నుండి ప్రతిరోజు 500 క్యూసెక్కుల నీటిని వదిలే విధంగా చర్యలు తీసుకుంటూ కాపువాడ నుండి నాగారం వరకు నాలాల వెంబడి ఉన్న గృహాలకు ఎలాంటి హాని కలుగకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, బల్దియా, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో అధికారుల ద్వారా బృందాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాల్సిందిగా ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకం కింద చేపడుతున్న భద్రకాళి బండ్ సుందరీకరణ పనులను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ వరంగల్ నగరం నుండి ఇన్ ఫ్లో ఉందని, హనుమకొండ నగరం నుండి అవుట్ ఫ్లో ఉందన్నారు. అధికారుల సమన్వయంతో భద్రకాళి చెరువు పూడికతీత పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, డీపీవో లక్ష్మీ రమాకాంత్, పలువురు తహసీల్దార్లు, ఐబీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: