హన్మకొండ ;

నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని తేజస్వి పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండలోని సైన్స్ సెంటర్ ను ఆధునికరించడానికి 10 కోట్ల రూపాయలు వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. త్వరలోనే వాటి పనులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతులమీదుగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు.సైన్స్ లేకుండా జీవితం లేదన్నారు. సైన్స్ ఫెయిర్ లలో పాల్గొన్న ప్రదర్శనలన్నింటిని టీచర్లు రాసుకొని తమ తమ పాఠశాలలో విద్యార్థులకు వివరించాలన్నారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందన్నారు. ప్రపంచ స్థాయిలో దేశాల మధ్య ఆర్థిక పరమైన పోటీలకన్నా శాస్త, సాంకేతిక రంగాలలోనే అతి పెద్ద పోటీ నెలకొని ఉందన్నారు. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయిన ఏపీజే అబ్దుల్ కలాం ఆశించిన విధంగా విద్యార్థులు కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలన్నారు. నిత్య జీవితంలో సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇన్స్పైర్ కు గాను కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినందనీయం అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ తమలోని సృజనాత్మక ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక అంశాలను ప్రదర్శించేందుకు విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ అనేది గొప్ప అవకాశం అన్నారు. ప్రతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ప్రాక్టికల్స్ ఎక్కువగా చేస్తే విద్యార్థులకు ఆ సబ్జెక్టు అంతగా అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద ల్యాబ్ లను అభివృద్ధి చేశామన్నారు. అంతేగాక స్మార్ట్ టీవీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎక్కువగా ఎక్స్పరిమెంట్ వీడియోలను చూపించాలని ఉపాధ్యాయులకు సూచించామని కలెక్టర్ తెలిపారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్ష 20 వేల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని, వీరందరికీ పాఠశాల దశ నుంచి సైన్స్ పట్ల అభిరుచి కలిగెలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సైన్స్ ఫెయిర్ లో నాణ్యమైన ప్రదర్శనలు రావడానికి గాను సైన్స్ టీచర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనల ప్రదర్శనతో పాటు పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లు, డిస్కషన్స్ లాంటివి కూడా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో జాతీయ స్థాయి పోటీకి హనుమకొండ విద్యార్థులు ప్రదర్శనలు వెళ్లారని తెలిపారు.

ఈ ప్రదర్శనలో 120 ఇన్స్పైర్ ఎగ్జిబిట్లు, 106 జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్, తేజస్వి పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: