హన్మకొండ ;
14న బాలల దినోత్సవం సందర్భంగా ఆటో నగర్ లోని బాలుర పరిశీలక గృహము లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కేక్ కట్ చేపించి,
అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలిసీ, తెలియని వయసులో చేసిన తప్పులు తిరిగి పునరావృతం చేయకుండా, చట్ట వ్యతిరేక పనులకు స్వస్తి చెప్పి, క్రమశిక్షణతో కూడుకున్న జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. మంచి మిత్రులతో సహవాసం చేయాలని, చెడు స్నేహం చేయరాదన్నారు. ఇకనైనా చట్టవ్యతిరేకమైన పనులను మానివేసి, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకునేలా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా బాలుర పరిశీలక గృహంలో పరిసర ప్రాంతాలను, రిజిస్టర్ లను, ఆహార సరుకులను, రోజువారి ఆహార నియమావళిని, ఔషధాలను, సి.సి.కెమెరాలను తనిఖీ చేయడం జరిగింది. ఎల్లప్పుడూ పరిసరాలను, గదులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అని సిబ్బందికి సూచించారు. బాలురకు అందిస్తున్న వసతులు, ఆహార పదార్థాల నాణ్యత ను అడిగి తెలుసుకున్నారు.
ఎటువంటి సహాయ సహకారాలకైననూ బాలురు ఎవరైననూ న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి, తగిన సహాయం పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.సురేష్, హోమ్ సూపరింటెండెంట్ వి. శ్రీదేవి, జువైనల్ బోర్డు మెంబర్లు యం.సుభాష్, డా.గోపికా రాణి, హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: