అమలులోకి వచ్చిన నూతన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రెవెన్యూ, పోలీస్, విద్య, విద్యుత్, రవాణా, ఎక్సైజ్, పౌర సరఫరాలు, మైనింగ్, యాంటీ నార్కోటిక్స్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల ఉన్నతాధికారులతో భారతీయ నూతన న్యాయ చట్టాలు, ఎన్ ఫోర్స్మెంట్, రోడ్డు భద్రత అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ అవుతున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలపై దృష్టి సారించేందుకు మండల, జిల్లాస్థాయిలో అధికారులు సమన్వయ సమావేశాలను నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నూతనంగా న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయని అన్నారు. ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినయం చట్టాలు అమలవుతున్నాయని అన్నారు. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఐఈఏ స్థానంలో భారతీయ సాక్ష్య అధినయం చట్టాలు అమలులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం సాంకేతికత ఎంతో పెరిగిందన్నారు. పెరిగిన సాంకేతికతతో నేరాలు కూడా పెరుగుతున్నాయి అన్నారు. అదేవిధంగా నూతన చట్టాలలో మహిళలు, చిన్నారుల రక్షణకు, భద్రతకు అనేక అంశాలు పొందుపరిచి ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ సంస్కరణలు, చట్టాల అమలు తీరుపై మంచి పేరు ఉందని అన్నారు. జిల్లాలో అధికారుల సమన్వయం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నియంత్రణకు తోడ్పాటునందించాలన్నారు.
నూతన న్యాయ చట్టాలపై పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల పనితీరు, తీసుకుంటున్న చర్యలపై వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వో వై. వి. గణేష్, డీసీపీ సలీమా, డీఈఓ వాసంతి, డిఎంహెచ్వో డాక్టర్ లలిత దేవి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, ఏసీపీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Post A Comment: