ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సిసిఐ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు, కొలతలు, పోలీస్, రవాణా, తదితర శాఖల అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఎంతమంది పత్తి రైతులు ఉన్నారు, ఎంత విస్తీర్ణంలో పత్తి సాగు అయ్యింది, గతంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తయా, ఆయా శాఖలు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ, తదితర వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
రైతుల నుండి జిన్నింగ్ మిల్లులకు పత్తి వస్తుందని, కానీ వస్తున్న పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉంటుందని, నవంబర్ మొదటి వారంలో నుండి అయితే రైతుల నుండి అధిక శాతం పత్తి వస్తుందని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఈనెల మూడో వారం నుండి పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సందేహాల నివృతి కోసం టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉండాలన్నారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి పత్తి కొనుగోలు ఎప్పటినుండి ఎప్పటి వరకు చేపట్టే సమయం వివరాలను తెలిపేలా కరపత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పత్తిని ఆరబెట్టి తేమశాతం లేకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిన్నింగ్ మిల్లులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి విస్తృత ప్రచారాన్ని కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పత్తి విక్రయించిన రైతులు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైన తమ ఆధార్ కార్డును ఏఈఓలు సేకరించే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ జేడీ రవీందర్ సింగ్ సూచించారు. పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. జిన్నింగ్ మిల్లుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యజమానులకు సూచించారు. పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేయాలని, అందుకు తగిన చర్యలను తీసుకోవాలని అన్నారు. వర్షాలు పడుతున్నందున ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, సీసీఐ వరంగల్ మేనేజర్ జితేందర్, ఎంవీఐ వేణుగోపాల్, ఇతర శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: