హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ
తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ,సంక్షేమ చట్టం- 2007 ప్రకారం పెండింగ్ లో ఉన్న కేసులను ఆర్డీవోలు త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం (25/09/2024) నుండి అక్టోబర్ 1 తేదీన నిర్వహించే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నేపథ్యంలో అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి సంబంధించి వారం రోజుల కార్యక్రమాల కార్యాచరణ వివరాల గోడ ప్రతులను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులకు సంబంధించిన పలు కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చట్టంపై అవగాహన కల్పించడానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఒకరోజు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో మొదటి రోజున సంబంధిత శాఖల అధికారులు, వయవృద్ధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గురువారం (26/09/2024)రోజున వృద్ధాశ్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, శుక్రవారం(27/09/2024) వయోవృద్ధుల హక్కులపై అవగాహన కల్పించడానికి ర్యాలీ, (28/09/2024) శనివారం జిల్లా స్థాయిలో అవగాహన సదస్సు, సంక్షేమం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారన్నారు, ఆదివారం(29/09/2024) నాడు గ్రామపంచాయతీ కార్యదర్శులు వయోవృద్ధుల హక్కుల పైన వయోవృద్ధుల సంబంధించిన చట్టాలపై కరపత్రాల ద్వారా అంగన్వాడి టీచర్ల ద్వారా పంపిణీ చేస్తారని చెప్పారు. సోమవారం(30/09/2024)
రోజున అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గ్రాండ్ పేరెంట్స్ డే ను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం రోజున జిల్లాస్థాయి లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం వయోవృద్ధుల హక్కులను సంరక్షిస్తామని అందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, డీఈవో వాసంతి, పరకాల ఆర్డీవో నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: