ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని హనుమకొండ జిల్లాకు సంబంధించిన ధర్మసాగర్, వేలేరు మండలాల అభివృద్ధికి అధికారులు తోడ్పడాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య ఆరోగ్య, విద్య, తదితర శాఖలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే, కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాల నివేదికను అందజేయాలన్నారు. ఈ రెండు మండలాలలో అక్రమ మైనింగ్ జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా ఆక్రమణకు గురి కాకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. భూముల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. వేలేరు మండలానికి సంబంధించి తహసిల్దార్, మండల పరిషత్ కార్యాలయాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. గురుకుల పాఠశాలలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ కు అందజేసినట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా నిధులను కేటాయిస్తారని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మెరుగైన సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే తన ధ్యేయమన్నారు. మిషన్ భగీరథ పథకం గురించి స్పందిస్తూ గ్రామాలు, గ్రామాలకు అనుబంధంగా ఉన్న ఆవాసాలలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం ప్రతిరోజు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు నిర్వహించాలని, రాబోయే దసరా, దీపావళి పండుగల సందర్భంగా రహదారులు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండే విధంగా ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నతీకరించడానికి తగిన ప్రతిపాదనలను కలెక్టర్కు అందజేయాలన్నారు. పెద్ద పెండ్యాల, మల్లికుదుర్ల గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చడానికి తగిన ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఈ మండలాల్లో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి నిర్వహిస్తున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాలకు వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు ఏవైనా సమస్యలపై వస్తే తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికారులు సమన్వయంతో నిబద్ధతతో పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకోవాలన్నారు.
వేలేరులోని కస్తూర్బా పాఠశాల భవనంపై మరో అంతస్తు నిర్మాణం చేయాలని కేజీబీవీ ప్రిన్సిపల్ కోరగా వెంటనే ఎమ్మెల్యే స్పందించి వాటి నిర్మాణానికి కావాల్సిన నిధులను అందించాలని కలెక్టర్ కు సూచించారు. దీనిపై కలెక్టర్ ప్రావీణ్య వెంటనే స్పందించి ఎస్డీఎఫ్ నుంచి నిధులను కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ధర్మసాగర్, వేలేరు మండలాల అభివృద్ధికి కావాల్సిన నిధులను అందజేస్తానని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను నాణ్యతగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, డీఎంహెచ్వో డాక్టర్ లలితా దేవి, డీఈవో వాసంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: