ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అద్దె భవనాలలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఆయా భవనాల యాజమాన్యమే మరమ్మతులు చేయించి సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్థితిగతులపై ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అద్దె భవనాల యాజమానులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలోని సొంత భవనాలతో పాటు అద్దె భవనాలల్లో కొనసాగుతున్న విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్యతో పాటు తరగతి గదులు, వాటర్, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాల గురించి ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్ళని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. అద్దె భవనాల లో గదులు, టాయిలెట్స్, డ్రైనేజీ, విద్యుత్, రంగులు వేయడం, డైనింగ్ హాల్, తదితర మరమ్మతు పనులను భవన యాజమాన్యమే పూర్తి చేయాలన్నారు. కాంపౌండ్ వాల్, భవనాలకు గ్రిల్స్ తప్పకుండా ఉండాలన్నారు. హసన్ పర్తి లో కొనసాగుతున్న డిగ్రీ కళాశాలతో పాటు ఇతర పాఠశాలలు, కళాశాలల్లో నెలరోజుల్లోగా మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మల్టీ జోనల్ ఆఫీసర్ అలివేలు, జిల్లా సమన్వయ అధికారి ఉమా మహేశ్వరి, హసన్ పర్తి , పరకాల, ఆత్మకూరు, ధర్మసాగర్, భూపాలపల్లి, హంటర్ రోడ్డు, ఎల్కతుర్తి, వరంగల్ వెస్ట్, శాయంపేట, వర్ధన్నపేట, తదితర పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అద్దె భవనాల యజమానులు పాల్గొన్నారు.
Post A Comment: