ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్,అగ్నిమాపక మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్తు, సాగునీటిపారుదల, మైనింగ్, మత్స్య, ఆర్ అండ్ బి, ఇతర శాఖల అధికారులతో పాటు గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులతో ఏర్పాట్లు, నిమజ్జనానికి సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జనానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో పాటు గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిమజ్జనం ప్రాంతాలలో ఒక్కో ప్రాంతంలో సీనియర్ జిల్లా అధికారితో పాటు మరొక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య, విద్యుత్తు, రెవెన్యూ, పోలీసు శాఖ, సాగునీటిపారుదల శాఖల అధికారులతో పాటు తగినంత సిబ్బంది నిమజ్జన ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తారన్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద తగినంత సిబ్బందిని విధులు నిర్వహించే విధంగా కేటాయిస్తామన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బందికి భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన ప్రాంతాలలో క్రేన్లను సిద్ధం చేయాలని మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీల ప్రతినిధులకు సూచించారు.
ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి గణేష్ ఉత్సవాల కు విజయవంతంగా పనిచేద్దామన్నారు.
ట్రాఫిక్ కు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉత్సవాల నిర్వహణ కు కృషి చేయాలన్నారు. గణేష్ ఉత్సవాల కు అందరూ సహకరించాలన్నారు. వాహనాలను నడిపేందుకు మంచి డ్రైవర్ల నియమించుకోవాలని ఉత్సవ కమిటీల ప్రతినిధులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు తాము అంత సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్,హనుమకొండ, కాజీపేట ప్రాంతాలలో తాగునీరు, తదితర ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.
హనుమకొండ జిల్లా పరిధిలో సాగునీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో 8 చెరువుల వద్ద, అదేవిధంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 14 చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్లు సాగునీటిపారుదల, మున్సిపల్ అధికారులు వెల్లడించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరాను చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. మండపాలకు అందించే విద్యుత్ సౌకర్యానికి ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిమజ్జన ప్రాంతాల వద్ద వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని డిఎంహెచ్ఓ లలితా దేవి తెలిపారు. అన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జన ఏర్పాట్లను చేస్తామని హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్ అన్నారు. పరకాల పరిధిలో ఐదు నిమజ్జన పాయింట్లు ఉన్నాయని ఆర్డీఓ డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర గురించి తమకు ముందస్తు సమాచారం అందించాలని, అందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లను చేసేందుకు వీలుంటుందని అన్నారు. నిమజ్జనం చేసే చెరువుల వద్ద అధికారులు బారీకేడింగ్ ఏర్పాటుచేయాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాట్ల గురించి హనుమకొండ, కాజీపేట ఏసీపీలు దేవేందర్ రెడ్డి, తిరుమల్ తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ వై.వి గణేష్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: