ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్తు పాలకమండలి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియనున్న సందర్భంలో ఈరోజు బుధవారం జడ్పీ సీఈవో విద్యాలత అధ్యక్షతన నిర్వహించిన పాలకమండలి ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించారని అన్నారు. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జడ్పీ పాలన సాగించారన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ పదవులు వస్తాయి, పోతాయని వాటి గురించి బాధపడాల్సిన పనిలేదని అన్నారు.అలాగే పొగడ్తలకు పొంగిపోవద్దని విమర్శలకు కృంగిపోవద్దని అన్నారు. కష్టాన్ని ఇష్టంతో పనిచేస్తేనే సంతృప్తి ఉంటుందన్నారు.ప్రజా ప్రతినిధులుగా మనం ప్రజలకు ఏమి చేశాం ,చేస్తామనేది పరిశీలన చేసుకోవాలని అన్నారు. తాను ఎంపీపీగా జడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశానని అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే ఈ ఐదేళ్ల కాలంలో విజయవంతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో ముందున్నామని తెలిపారు. ఇందుకుగాను అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ డా. సుధీర్ కుమార్ ను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీరాములు ,అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డి ఆర్ డి ఏ పిడి నాగ పద్మజ,డిఎంహెచ్వో సాంబశివరావు,ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవి లత, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు రామ్ రెడ్డి, జడ్పీటీసీలు,ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: