: మహదేవపూర్ పలివెల మండలాలలోని పంకెన1, పంకెన2, పలిమెల2, అంబటిపల్లి 2, అంబటిపల్లి 2, అంబటిపల్లి 3, అంబటి పల్లి 4, పెద్దంపేట క్వారీలలో ఇసుకను కూలీల ద్వారా గోదావరి ఒడ్డునకు చేరవేసి కూలీల ద్వారానే రవాణా చేయించే విధంగా టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు భారీ యంత్రాలతో ఇసుకను తోడి,రవాణా చేస్తున్నందున వీరి క్వారీలను రద్దు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అజ్మీర పూల్ సింగ్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట ఆదివాసి హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గొరిగే కిరణ్ కుమార్, నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లంకొండ పోచయ్య, మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ బొబ్బిలి రాజు తదితరులు ఉన్నారు. ప్రజలకు పని కల్పించే ఉద్దేశంతో గోదావరి నదిలో ఇసుక క్వారీలను ప్రభుత్వం మంజూరు చేసిందని అజ్మీర పూల్ సింగ్ పేర్కొన్నారు. ఈ క్వారీలు ఉన్న ప్రాంతంలో గిరిజనులు, ఎస్సీ, బిపిఎల్ కంటే దిగువ ఉన్న గ్రామాలైనందున క్వారీలను కూలీల ద్వారా నిర్వహిస్తే వీరికి పూర్తి స్థాయి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. నిరక్షరాస్య నిరుపేద గ్రామాలలో క్వారీలను సొసైటీల నుండి అక్రమ పద్ధతులలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆదాయాన్ని కొల్లగొడుతూ యంత్రాల ద్వారా జెసిబిల ద్వారా రాత్రనక పగలనక పెద్ద మొత్తంలో గోదావరి నుండి ఇసుకను డంపులుగా పేర్చారు. భారీ లారీలలో నింపడానికి కూడా జెసిబిలను వాడుతున్నారు. ప్రజలకు చిన్న పని కూడా కల్పించకుండా స్థానిక దళారులను దరి చేర్చుకొని క్వారీలు దర్జాగా నడుపుకుంటున్నారని కలెక్టర్ కు వివరించారు. గిరిజన ఎస్సీ బీసీలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు న్యాయం చేయాలని, వీలుగానిపక్షంలో సమగ్ర విచారణ జరిపి క్వారీలను రద్దు పరచాలని ప్రజా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు విజ్ఞప్తి చేశారు.
Post A Comment: