ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హైదరాబాద్ తో పోటీపడేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇకపై తాను ప్రత్యేక ఫోకస్ పెడతానని పేర్కొన్నారు. అధికారులు వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి 8 అంశాలపై మూడు గంటలపాటు హనుమకొండ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రింగ్ రోడ్డు, నిర్మాణం స్మార్ట్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, విమానాశ్రయం పరిస్థితి, కాలోజీ కళాక్షేత్రం పనులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మొదట రింగ్ రోడ్డు నిర్మాణం పై హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు ఫేసుల్లో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి మొదట సత్వరమే భూ సేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. వరంగల్ నుంచి ఇతర జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా జాతీయ రహదారుల కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వరంగల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు కాలనీలు మునుగుతున్నాయని ఇందుకోసం శాశ్వతంగా పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకరం చుట్టాలని, నాలాల ఆక్రమణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. నాలాల్లో శిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. హైదరాబాదులో చేపడుతున్న కొత్త పద్ధతులను వరంగల్లో ప్రయోగించాలని పేర్కొన్నారు. అక్కడ వరదలు వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారో ఇక్కడ అమలు చేయాలని అధికారులకు సూచించారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పై డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారుల ఆదేశించారు. వర్షం కురిచినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల అంచనాల వ్యయం ఎందుకు పెరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఈపీసీ పద్ధతిన పనులు చేపడుతున్నందున అలా పెంచే వీలు లేదని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల విలువ అంచనాల పెంపుపై ప్రత్యేక రిపోర్టు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ 2050 సంవత్సరం వరకు డిజైన్ చేయాలని సూచించారు. సమగ్ర వివరాలతో డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ లో హైదరాబాదులో ఉన్న నిలోఫర్ ఆస్పత్రి లాగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటా మని వెల్లడించారు. మమునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందో తెలుసుకోవాలని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 9 నాటికి కాళోజి కళాక్షేత్రం నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలిపారు. పనులు పూర్తి చేసి ప్రారంభించ డానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో ఆపరేషన్లు ఇతర వైద్య సేవలకు నిమ్స్ లో అందిస్తున్నట్లుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఎన్ఓసి ఇచ్చే అంశంపై పరిశీల జరుపుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయంలో సర్జరీలు, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు సిబ్బందికి తగిన పారితోషికం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని వెల్లడించారు. స్కూల్ విద్యార్థుల యూనిఫాంలో సంబంధించిన పెండింగ్ బిల్స్ ఉంటే వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫామ్ లు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే అవకాశం ఉందని ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందిరా మహాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమగ్రంగా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో సమగ్ర వివరాలతో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధికి 6115 కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా గుర్తించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం స్వశక్తి మహిళలకు 518 కోట్ల 71 లక్షల 20వేల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.
Post A Comment: