ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని హన్మకొండలోని నయీమ్ నగర్ లో గల చైతన్య డిగ్రీ, యూనివర్సిటీ కళాశాలల ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం మాజీ సెక్రెటరీ ఎస్. చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. గత మూడు దశాబ్దాలుగా చైతన్య విద్యాసంస్థలు, ప్రస్తుత సిడియు అనేక అవార్డులు, నాణ్యమైన విద్యను అందించడంలో పురోగతిని సాధించాయని ఆయన ప్రశంసించారు. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్దేశిత విషయాలను క్రోడి కరించుకొని నాయకత్వ పటిమని కనబరచాలని సూచించారు. విజయాన్ని సాధించడానికి నిరంతర అంకితభావం అవసరమన్నారు. భారత ప్రభుత్వ సలహా మేరకు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీని హైదరాబాద్కు మార్చవలసి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం సిడియు 24 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఉద్యోగాలు ఇచ్చేటందుకు రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ స్నాతకోత్సవంలో 45 మంది పరిశోధనాత్మక పట్టాలు సమర్పించగా వారిలో 12 మంది పీహెచ్డీ డిగ్రీలకు ఎంపిక కావడం జరిగిందని, ప్రస్తుతం ఆరుగురు వారి పీహెచ్డీ పట్టాలని పొందినట్లుగా తెలిపారు. ప్రతిభగల పరిశోధనలు చేసిన అధ్యాపకులకు బంగారు పతకాలతో పాటు లక్ష రూపాయల నగదును కూడా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 15 దేశాల నుండి వివిధ కోర్సులలో 415 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లుగా చెప్పారు. డిగ్రీలో 6 గురికి, పీజీలో 7 గురికి ర్యాంకులు పొందిన వారికి బంగారు పతకాలను అందజేశారు. ఈ స్నాత కోత్సవంలో మొత్తం 756 మంది విద్యార్థులు డిగ్రీలను పొందారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన వారిని, బంగారు పతకాలను సాధించిన వారిని అతిధులు అభినందించారు. కార్యక్రమంలో గౌరవ అతిధులు, కళాశాల యూనివర్సిటీల బాధ్యులు ఇనుగాల పెద్దిరెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, చైర్మన్ వి పురుషోత్తం రెడ్డి, దామోదర్, విక్రం రెడ్డి, సాత్విక, వీర వెంకటయ్య, రవీందర్, అధ్యాపకులు, గాదె రాంబాబు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: