ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ :
ఈనెల 20వ తేదీన జరగనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈనెల 20వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, అదేవిధంగా మార్చి 3వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఫిబ్రవరి 20వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని, అదేవిధంగా మార్చి మూడవ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఈనెల 20వ తేదీన జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలు , పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 2లక్షల 33 వేల 500 మంది పిల్లలకు ఈ మాత్రలను వేయడానికి ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మాత్రను ఫిబ్రవరి 20వ తేదీన వేయించకుంటే 27వ తేదీన వేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మార్చి మూడవ తేదీన జిల్లావ్యాప్తంగా 79 వేల 227 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్వో వై.వి. గణేష్, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ యాకుబ్ పాషా, డిఐఓ డాక్టర్ వాణిశ్రీ, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాశ్రీ, డిటిసిఓ డాక్టర్ హిమబిందు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: