ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ విభిన్న రంగాల్లో దివ్యాంగులు రాణించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హనుమకొండ లోని అంబేద్కర్ భవన్ లో జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఇటీవల వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించగా బహుమతులు, ప్రశంసా పత్రాల ప్రదానోత్సవం అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలన్నారు. మనో సంకల్పం ముందు శారీరక అవరోధం కానీ కాదని, సంకల్ప సిద్ధి, మనో ధైర్యమే విజయ సాధనాలని పేర్కొన్నారు. దివ్యాంగులు జీవితంలో అనుకున్నది సాధించగలమనే ఆత్మస్థైర్యంతో ఎల్లప్పుడు ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు వివిధ క్రీడా పోటిల్లో పాల్గొని ప్రతిభను చాటడం అభినందనీయమన్నారు.
*ఆకట్టుకున్న చిన్నారులు*
పలువురు చిన్నారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పలు సినీ గీతాలకు నృత్యాలు చేసి అందరిచేత అభినందనలు అందుకున్నారు. మల్లికాంబ మనో వికాస కేంద్రం చిన్నారులు.. దేవుళ్ళు చిత్రంలోని మీ ప్రేమ కోరే చిన్నారులం, అదేవిధంగా దేవత చిత్రంలోని వెల్లువచ్చే గోదారమ్మా తదితర సినీ గీతాలకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలకు చెందిన చిన్నారి ఓం నమో వెంకటేశాయ చిత్రంలోని వేయి నామాలవాడ వెంకటేశుడా గీతానికి అద్భుతంగా నృత్యం చేశారు.
*ప్రతిభావంతులకు పురస్కరాలు*
దివ్యాంగులకు పరుగు, చెస్, క్యారమ్స్, షాట్ పుట్, జావెలిన్ త్రో, తదితర పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన చిన్నారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు.
జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అనితా రెడ్డి, బి డబ్ల్యు కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు నల్లెల్ల రాజయ్య, ధనుంజయ్ కుమార్, రామకృష్ణ, అనిల్ కుమార్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి మచ్చ రాజు, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సంతోష్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ రవికృష్ణ, దివ్య, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: