ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ తీసుకువచ్చిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను  హనుమకొండ జిల్లాలో నేటి నుండి అమలవుతాయని  హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.

శనివారం మధ్యాహ్నం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతిఆసుపత్రి ( గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్) ఆవరణలో  మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకం జీరో టికెట్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆర్టీసీ అధికారులు  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  మహిళలు, బాలికలు, వృద్ధ మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణం చేసేందుకు వీరికి జీరో  టికెట్ ఇవ్వబడుతుందన్నారు. మహిళల ఉచిత ప్రయాణం చేయడానికి తెలంగాణ చిరునామాను కలిగి ఉంటే సరిపోతుందన్నారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం కింద రూ. 10 లక్షలను ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా వైద్యం కోసం అందిస్తుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఈ పథకం ద్వారా పేదలు వైద్య సేవలను  అందుకోవచ్చునని అన్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి.సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి ఈ పథకం వరమని  తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలకు నగదు రహిత చికిత్స తో పాటు రోగికి ఉచిత ఆహారం, రవాణా చార్జీలు ఇవ్వబడతాయన్నారు. హనుమకొండ జిల్లాలోని  ఐదు ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు  37 ప్రైవేట్ ఆస్పత్రుల్లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమలవుతుందన్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ  డిప్యూటీ ఆర్ ఎం  మాధవరావు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలందరికీ  వరం లాంటిది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు,బాలికలు,వృద్ధ మహిళలు,ట్రాన్స్ జెండర్లు ఎంపిక చేయబడిన ఆర్డినరీ సిటీ, సబర్బన్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో  ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.

 *ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించిన కలెక్టర్*

 హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఆర్టీసీ బస్సు ముందు పచ్చ జెండా ఊపి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మహిళలతో కలిసి బస్సులో  ప్రయాణించారు. ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల నుండి అశోక జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, హయాగ్రీవా చారి కాంపౌండ్, కాళోజీ సెంటర్, అంబేద్కర్ కూడలి, పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, తదితర ప్రాంతాల మీదుగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తిరిగి హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.  ఆర్టీసీ బస్సులో  ప్రయాణానికి సంబంధించిన జీరో టికెట్ను  కలెక్టర్ తీసుకున్నారు. అదేవిధంగా మహిళలు తీసుకున్న జీరో టికెట్లను  కలెక్టర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ పిడి శ్రీనివాస్ కుమార్, ఆర్టీసీ అధికారులు, వైద్యాధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: