ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ నియోజకవర్గ లబ్ధిదారులకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవరూ కూడా మధ్యదళారులను, ఎవరిని కూడా ఆశ్రయించవద్దని అన్నారు. అలా ఎవరినైనా ఆశ్రయించి ప్రభుత్వ పథకాల కోసం డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే వారికి ప్రభుత్వ పథకాలు అందవని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే లబ్ధిదారులు తమకు గానీ, అధికారులకు గానీ తెలియజేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తో కలిసి రాబోయే రోజుల్లో జిల్లాను హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తామన్నారు. ఇందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో చర్చించడం జరిగిందన్నారు. ఇటీవల వరకు ఎన్నికల కోడ్ ఉండడంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందలేదని, ఎన్నికల కోడ్ ముగియడంతో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగానే కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ, బీసీ వెల్ఫేర్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. కొన్ని నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయని, అన్ని కార్యక్రమాలు ఆ లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా చెక్కులు అందుకున్న లబ్ధిదారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 220మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ లు రూ.2కోట్ల 20 లక్షల 25వేల 520ల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ, కాజీపేట మండలాల తహశీల్దార్లు విజయ్ కుమార్, భావ్ సింగ్, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ(శ్రీమాన్), తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: