ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు నుండి కౌంటింగ్ వరకు ప్రతి ఖర్చు ఎన్నికల వ్యయం కింద జమ అవుతుందని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్ రావు గవాండే అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశహాలులో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు ఎన్నికల వ్యయంపై సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్ రావ్ గవాండే మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము ఖర్చు చేస్తున్న వ్యయాన్ని తప్పకుండా చూపించాలన్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా ఎన్నికల వ్యయం రూ.40 లక్షలకు మించరాదన్నారు. 40 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేసినట్లయితే ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటిస్తుందన్నారు. అభ్యర్థులు కరపత్రాలు పోస్టర్లు అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రచారానికి వినియోగించాలన్నారు. ప్రతి కరపత్రం పోస్టర్ పైన ముద్రించిన వారి పేరు ఫోన్ నెంబరు ఎన్ని ప్రతులు అనేది తప్పనిసరిగా సూచించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో వాడిన ప్రతి ప్రచార సాధనాల యొక్క రేటు జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం ఖర్చు చూపించాల్సి ఉంటుందన్నారు. స్టార్ కంపెనీ తో సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ఆ ఖర్చులు సంబంధిత అభ్యర్థి మాత్రమే భరించాల్సి ఉంటుందన్నారు. స్టార్ క్యాంపెనర్ సభలో సమావేశాల్లో ఒకరికి మించి అభ్యర్థులు పాల్గొన్నట్లయితే ఆ సభకు అయిన ఖర్చును హాజరైన అభ్యర్థులకు సమానంగా లెక్కిస్తామన్నారు. అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బులు గిఫ్టులు పంచితే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పకుండా పత్రికల్లో ఏవైనా కేసులు ఉన్నాయా లేవా అనే వివరాలను మూడుసార్లు పోలింగ్ ముందు వరకు ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల వ్యయాన్ని ఎంత ఖర్చు చేశారు దేనికి ఖర్చు చేశారా అనే వివరాలను తప్పకుండా చూపించాలన్నారు . పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని చూపించనట్లయితే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. అభ్యర్థులు ఒకరోజు రూ.10 వేల కంటే ఎక్కువ నగదును ఖర్చు చెయకూడదన్నారు. అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాల, వినియోగించే పూలదండలు కార్పెట్, వాటర్, టీ, ఇలా అన్నీ కూడా ఎన్నికల వ్యయం కింద జమ అవుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బ్యాంకు అకౌంటును అప్డేట్ చేసుకోవాలన్నారు. ఏవైనా పత్రికల్లో, చానళ్ల లో అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలు వస్తే ఎం సి ఎం సి కమిటీ వాటిని గుర్తించి సంబంధిత అభ్యర్థులకు నోటీసులు అందజేస్తుందని, ఆ నోటీసులకు సదరు అభ్యర్థులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈనెల 18, 22,26 తేదీల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ నోడల్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఏ ఈ ఓ లు, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు అభ్యర్థుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: