ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హనుమకొండ రెవిన్యూ కాలనీ, వడ్డేపల్లి పరిధిలో బీఎల్వోలు ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తుండగా ఆయా కాలనీలో కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లను వారి ఇళ్ల వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం కలిశారు. రెవెన్యూ కాలనీలో ఓటరు అయినా సంధ్యారాణి, ఎక్సైజ్ కాలనీ కూరగాయల మార్కెట్ సమీపంలోని సయ్యద్ మజహర్ హుస్సేన్, వడ్డేపల్లి గవర్నమెంట్ స్కూల్ సమీపంలో ఉన్న రమాదేవిలను వారివారి ఇళ్ల వద్దకు వెళ్లి కలెక్టర్ మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు, ప్రతి ఎన్నికల సమయంలో ఓటు వేస్తున్నారా, ఓటరు లిస్ట్ లో ఉన్న వివరాలు, ఓటరు స్లిప్ ఎప్పుడు అందించారనే వివరాలను సంధ్యారాణి, సయ్యద్ మజహర్ హుస్సేన్, రమాదేవిలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయా ఏరియాలో ఉన్న ఓటర్ల వివరాలను స్థానిక బిఎల్ఓలు సైదా, మౌనిక, జ్యోతిలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఓటు స్లిప్పులను అందిస్తూ వారి సంతకాలను తీసుకుంటున్నట్లు బిఎల్వోలు కలెక్టర్ కు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఓటర్లకు కలెక్టర్ సూచించారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు . తాను సీనియర్ సిటిజెన్ అని పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకునే వీలుందా అని అధికారులను సయ్యద్ మజాహార్ హుస్సేన్ అడిగి తెలుసుకున్నారు. తన ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందొ బిఎల్ వో ద్వారా తెలుసుకున్నారు. ఓటరు స్లిప్పులను త్వరగా పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. రమేష్, సివిల్ సప్లై అధికారి ఉమారాణి హనుమకొండ తహశీల్దార్ విజయకుమార్, కృష్ణ, షాజీద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: