ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో కలిసి కలెక్టర్ మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ రెండు నియోజకవర్గాల్లో 508124 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 56752 ఎపిక్ కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఓటేసేందుకు ఓటర్లు తమ ఎన్నికల గుర్తింపు ( ఎపిక్) కార్డుతో పాటు ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ కార్డ్, ( ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులు ) పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని రెండు నియోజకవర్గాల్లో 92. 35 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో పరకాల నియోజకవర్గంలో 96.52శాతం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 89.12 శాతం ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేసినట్లు చెప్పారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 484 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 68 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సహకారంతో నిరంతర విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్, తదితర మౌలిక వసతులను కల్పించినట్లు చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో అన్ని పోలింగ్ కేంద్రాలలో నూరు శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్బన్ ప్రాంతం కావడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరకాల నియోజకవర్గంలో 68 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాలలో 28 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తుండగా అక్కడ రెండు ఈవీఎంలు , వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఒక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాల్లో ఈనెల 21, 22, 23 తేదీల్లో హోం ఓటింగ్ను నిర్వహించినట్లు తెలిపారు . ఈ రెండు నియోజకవర్గాల్లో 96.64 శాతం హోం ఓటింగ్ నమోదయింది అన్నారు. ఎన్నికలలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు పరకాల, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాలకు రెండు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ను వేయవచ్చని అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోపరకాల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఫెసిలిటీషియన్ సెంటర్లు కూడా 29వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చన్నారు. అదేవిధంగా కౌంటింగ్ కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు . మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిసినట్లు కలెక్టర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Post A Comment: