ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణపై న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులందరూ అంకితభావంతో పని చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రలోభాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. మద్యం, నగదు పంపిణీని కట్టడి చేయడంలో చివరి రెండు రోజులు కీలకమని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిపారు. ఓటర్ వివరాలతో కూడిన స్లిప్పులను జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన సి-విజిల్ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, తదితర వాటి కోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ గడువులోపు అనుమతులను జారీ చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పాల్గొన్నారు.
Post A Comment: