ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యా శాఖ అధికారి అధ్యక్షతన ఘనంగా జరిగింది.

 ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గురుపూజోత్సవానికి శ్రీకారం చుట్టిన అనంతరం, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా సన్మానించారు. 

       ఈ సందర్భంగా  ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్ధ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు - మన బడి కార్యక్రమం కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులలో మెరుగైన విద్య, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ సమసమాజ స్థాపనకు మూల కారకులుగా నిలువాలని కోరారు. గురువుల ఔన్నత్యం గురించి ఎంత పొగిడినా తక్కువేనని, సమాజ నడవడిక ఉపాధ్యాయుల పైనే ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. దీనిని గుర్తెరిగి తమ గురుతర బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. విద్యా బోధనతో పాటు విద్యార్థులలో నైతిక విలువలు, సద్గుణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు.

మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, సమాజంలో ఎవరు ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా, అందుకు గురువు అందించిన తోడ్పాటు, కృషియే కారణమని అన్నారు.అంకితభావం, నిబద్దతతో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తే వారికి తగిన గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించిన వారవుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యాబుద్ధులు, వినయ విధేయతలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. అందుకే గురువులను దైవంతో సమానంగా భావిస్తారని అన్నారు. సామాన్య, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసి ఆదర్శప్రాయులుగా నిలువాలని ఉపాధ్యాయులకు సూచించారు.

      ఈ కార్యక్రమంలో కూడ చైర్మన్ సుందర్ రాజ్,అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డిఈఓ  అబ్దుల్ హై ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: