ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా అద్బుతాలకు కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ వైద్య క‌ళాశాల త‌ర‌గ‌తులను సీఎం కేసిఆర్ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత ర్యాలీలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌లు జక్కు శ్రీ హర్షిణీ రాకేష్‌, గండ్ర జ్యోతి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసు దేవారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూపాలపల్లిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరితే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తోసిపుచ్చారన్నారు. కానీ ఈనాడు సీఎం కేసీఆర్‌ ఒక మంచి ఉద్దేశ్యంలో భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని, దీంతో ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని అన్నారు. మంథని ప్రాంతానికి 52కిలో మీటర్ల దూరంలో ఉన్న భూపాలపల్లిని పట్టించుకునే వారు కాదని, ఈనాడు ఇక్కడ ఒక ప్లాట్‌ లేక ఏదో ఒక ఆశ్రయం ఉండేలా ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ఈనాడు అనేక ప్రాంతాలకు అభివృధ్దిబాటలు పడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే అనేక ఏండ్లు దేశాన్నిపరిపాలన చేసిన కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేసిండ్లో, ఏం చేస్తరో చెప్పని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 76ఏండ్లలో 55ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని, చెప్పేవాళ్లకు వినేవాళ్లు లోకువ అన్నట్లుగా అనేక మాటలు చెప్తున్నారని ఆయన విమర్శించారు.అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చామని చెప్పుకునే కాంగ్రెస్‌ ఈనాడు అదే స్వాతంత్య్రాన్నిఅపహస్యం చేస్తున్నారని ఆయన వాపోయారు. ఏమీ చేసిండ్లో, ఏం చేస్తరో చెప్పకుండానే మళ్లా ఓట్ల కోసం అధికారం కోసం ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడు గొప్పగా ఆలోచన చేసి మనకు ఓటు హక్కు కల్పిస్తే ఆ ఓటును వినియోగించుకునే ముందు ఆలోచన చేయకపోవడం మూలంగానే అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడుకల ఆస్పత్రి, వంద సీట్ల మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ముందు చూపుకు పని చేసి చూపించే సత్తా కేవలం బీఆర్‌ఎస్‌పార్టీ సీఎం కేసీఆర్‌కే ఉందని ఆయన గర్వంగా చెప్పారు. పని చేయని పార్టీలకు ఓట్లు వేయవద్దని, ఓటు విలువ ప్రజలకు తెలియదనే అహంకారం ఆ పార్టీల నాయకుల్లో ఉందని, అలాంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. భవిష్యత్‌ తరాల గురించి ఆలోచన చేసే వాళ్లు కేవలం బీఆర్‌ఎస్‌పార్టీలోనే ఉంటారని ఆయన అన్నారు. అనేక ఏండ్లు తండాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేశారని, దీంతో తండాల ప్రజల కష్టాలు తీరాయని ఆయన అన్నారు. అధికారం, పదవులు, ఓట్ల కోసం ఆనాడు నియోజకవర్గంలో రింగ్‌రోడ్డును మొదలు పెట్టి పూర్తి చేయకుండా వదిలివేశారని, తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రింగ్‌ రోడ్డును పూర్తి చేసిన చరిత్ర తనదేనని అన్నారు. ప్రజల్లో ఆలోచన శక్తి లేకపోవడం మూలంగానే ఈనాడు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓట్ల కోసం గ్రామాలకు వచ్చి మాయమాటలు చెప్పుతున్నారని, ప్రజలు చైతన్యవంతులు కావాలని, ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుని మన కోసం పనిచేస్తూ మన ఆకలి తీర్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అభివృద్ది చేయాలనే తపన ఆరాటం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలువాలని, బీఆర్‌ఎస్‌పార్టీకి పట్టం కట్టాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: